వఝుల సీతారామశాస్త్రి జూన్ 25, 1878కు సరియైన బహుధాన్య నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ చతుర్థి న ఆరామద్రావిడశాఖకు చెందిన ప్రముఖ విద్వత్ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు చినసీతారామస్వామిశాస్త్రి. తండ్రి ముఖలింగేశ్వరుడు. తల్లి పేరు వేంకటాంబిక[1]. సీతారామశాస్తి ఇంటిపేరు కూడా ఒజ్జ (ఉపాధ్యాయుడు) లు అనే పదం నుంచి వచ్చిందని పలువురు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారంటే వారి కుటుంబంలోని విద్వత్ సంప్రదాయం గురించి తెలుస్తోంది. గణితశాస్త్రాధ్యయనం, మూహూర్త నిర్ణయం, జన్మనక్షత్ర జాతకాదుల పరిశీలన వారి కుటుంబంలో పరంపరాగతంగా వచ్చిన విద్యలు. ఆయన స్వగ్రామం బొబ్బిలి సమీపంలోని పాలతేరు[2]. ఆయన విజయనగర సంస్కృత కళాశాల, చెన్నపుర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలల్లో దశాబ్దాల పాటు బోధనా వృత్తిలో పనిచేశారు. మే 29, 1964 న మరణించారు.[3]